న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అంతకన్నా ముందుగా సమావేశాలపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుండగా ఆ మరుసటిరోజైన 31వ తేదీన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అన్ని పార్టీల ప్లోర్ లీడర్లతో భేటీ జరగనుంది. ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 


పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించిన అనంతరం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే లోక్ సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 16వ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి.