బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ ఆహుజా శనివారం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఆరాధించే హనుమంతుడిని ప్రపంచంలోనే తొలి గిరిజన నాయకుడిగా ఆయన అభివర్ణించారు. ఆదివాసీలకు నాయకుడిగా వ్యవహరించిన హనుమంతుడి సైన్యానికి రాముడు దగ్గరుండి శిక్షణ ఇచ్చాడని ఆయన పేర్కొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బర్మార్ ప్రాంతంలో ఏప్రిల్ 2వ తేదిన జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలో హనుమంతుడి చిత్రానికి అగౌరవం కలిగించే సంఘటనలు జరిగాయని.. ఆ పరిణామాలు తనను ఎంతగానో కలచివేశాయని ఆహుజా తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు చేసే నిరసన కార్యక్రమంలో స్వయానా గిరిజనుడైన హనుమంతుడిని అగౌరవించడం ఏ విధమైన సంప్రదాయమని.. గిరిజనులకు ప్రతీకగా హనుమంతుడిని చెప్పకోవచ్చని ఈ సందర్భంగా ఆహుజా పేర్కొన్నారు. 


ఇదే విషయాన్ని తాను ఎంపీ కిరోరి లాల్ మీనాతో చెప్పానని ఆహుజా అన్నారు. "ఈ ప్రపంచంలోనే తొలిసారిగా ఆదివాసీలకు నాయకత్వం వహించిన వ్యక్తి హనుమంతుడు. ఈ దేశంలో ఎక్కువ ఆలయాలు కూడా హనుమంతుడికే ఉన్నాయి. అతన్ని మనం అగౌరవించకూడదు" అని ఆహుజా హితవు పలికారు. గతంలో కూడా ఆహుజా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సెక్స్, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని ఆయన ఆరోపించారు.