మసీదులపై మైకులు వాడొద్దు : జావేద్ అక్తర్
జావేద్ అక్తర్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌తో గొంతు కలిపారు
ప్రముఖ గేయ రచయిత, కవి, మాజీ రాజ్యసభ సభ్యుడు జావేద్ అక్తర్ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌తో గొంతు కలిపారు. నివాసా ప్రాంతాల మధ్య వుండే మసీదులు మైకులు ఉపయోగించొద్దు అంటూ జైవేద్ అక్తర్ ఓ ట్వీట్ చేశారు. ఆ మాటకొస్తే, నివాసాల మధ్య వుండే ఏ ప్రార్థనా మందిరం అయినా మైకులు ఉపయోగించవద్దు అంటూ జావేద్ అక్తర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సరిగ్గా ఏడాది క్రితం గాయకుడు సోనూ నిగమ్ కూడా ఇదే విషయంపై గళమెత్తడంతో ఆయన అంతుచూస్తాం అంటూ కొన్ని ముస్లిం సంస్థలు బెదిరింపులకి పాల్పడ్డాయి. తాజాగా సోనూ నిగమ్‌కి ప్రాణ హానీ వుందని తెలుసుకున్న మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు అతడికి రక్షణ కట్టుదిట్టం చేయాల్సిందిగా ముంబై పోలీసులని అప్రమత్తంచేశాయి.
సోనూ నిగమ్‌తోపాటు బీజేపీ నేతలు రామ్ కదమ్, ఆశీష్ షెలర్‌కి పాకిస్థాన్‌కి చెందిన ఓ తీవ్రవాద సంస్థ నుంచి ప్రాణహాని వున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. సోనూ నిగమ్ పబ్లిక్ ప్రదేశాల్లోకి కానీ లేదా ఏదైనా సినిమా ఫంక్షన్స్‌కి కానీ హాజరైనప్పుడు అసాంఘిక శక్తులు అతడిని లక్ష్యంగా చేసుకుని దాడులకి పాల్పడే ప్రమాదం లేకపోలేదని ఇంటిలిజెన్స్ వర్గాలు ముంబై పోలీసులకి స్పష్టంచేశాయి. ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు సోనూ నిగమ్‌కి భద్రత కట్టుదిట్టం చేశారు.