మధ్యప్రదేశ్ సర్కారులో మంట..!!
మధ్యప్రదేశ్‌లో సర్కారులో మళ్లీ రాజకీయ ముసలం పుట్టింది. కమల్ నాథ్ సర్కారుకు రాజకీయ సుడిగుండం ఏర్పడుతోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. రాజకీయ వేడి రాజుకుంటోంది.
మధ్యప్రదేశ్‌లో సర్కారులో మళ్లీ రాజకీయ ముసలం పుట్టింది. కమల్ నాథ్ సర్కారుకు రాజకీయ సుడిగుండం ఏర్పడుతోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. రాజకీయ వేడి రాజుకుంటోంది.
మార్చి 26న మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ కప్పల తక్కెడ అటు ఇటూ కదులుతోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానాలోని ఓ రిసార్టుకు చేరుకున్నారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నలుగురు ఎమ్మెల్యేలు హర్యానాలోని రిసార్టుకు వెళ్లిపోయినట్లు ఆర్థిక మంత్రి తరుణ్ బానోత్ అంగీకరించారు. వారితో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. బీజేపీ నేతలు రాంపాల్ సింగ్, నరోత్తమ్ మిశ్రా, అరవింద్ బహదురియా, సంజయ్ పాతక్ .. తమ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పేందుకు ప్రయత్నించారని డిగ్గీరాజా ఆరోపించారు. కానీ తమ ఎమ్మెల్యేలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శిబిరంలో మొత్తం 10 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వారిలో తమ ఎమ్మెల్యేలు మాత్రం తమతో వస్తారని తెలిపారు. ఇప్పటికే బీజేపీ శిబిరంలో ఉన్న బిసాహులాల్ సింగ్, రమాబాయ్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. వారిద్దరూ వచ్చేందుకు అంగీకరించారన్నారు. మంత్రులు జితు పట్వారి, జైవర్ధన్ సింగ్‌తో మాట్లాడాల్సి ఉందని తెలిపారు. ఐతే భారీ ముడుపులు ఇస్తామని మభ్యపెట్టి .. తమ ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కుని వెళ్లారని దిగ్విజయ్ సింగ్ వివరించారు.
మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌ది కాగా.. మరో రెండు బీజేపీ స్థానాలు. ఐతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో రెండు స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తమ రెండు స్థానాలు తమకే దక్కాలని బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత సాధారణ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రగ్యాసింగ్ ఠాకూర్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. అటు గుణా నుంచి ఓటమి పాలైన జ్యోతిరాదిత్య సింగ్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య గెలుపు కోసం పోరాటం సాగుతోంది.
మొత్తం 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది బలం ఉంది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 116. ఐతే కాంగ్రెస్ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు క్యాంపు ఏర్పాటు చేసుకోవడంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది.