పంజాబ్ పాఠశాలలలో బోధించే పురుషులు కుర్తా, పైజామా ధరించి స్కూళ్లకు రాకుంటే బాగుంటుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఓమ్ ప్రకాష్ సోని అభిప్రాయపడ్డారు. "ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు. వారు కాస్త సమాజం పట్ల గౌరవంతో ఉంటే బాగుంటుంది.  అలాగే హుందాగా ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. అందుకే అందరిలాగే చొక్కా, ప్యాంటు ధరించి స్కూలుకి వస్తే సంతోషిస్తాను.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజమే.. కుర్తా, పైజామా అనేవి మన సంప్రదాయంలో భాగమే.. కాదనను. కానీ విద్యాలయాల్లో మాత్రం ఇలాంటి దుస్తులు ధరించడాన్ని ఆక్షేపించాలి. లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి" అని ఓం ప్రకాష్ సోని తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేసే టీచర్లు ప్రైవేటు స్కూలు టీచర్లను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని.. అవి తాను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని సోని తెలిపారు. 


అయితే సోని చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ వివరణ ఇచ్చారు. కుర్తా, పైజామా దుస్తులకు వ్యతిరేకంగా ఆ మాటలను భావించాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీతో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా కుర్తా, పైజామా ధరిస్తారని ఆయన తెలిపారు. కాగా, ఇటీవలికాలంలో పంజాబ్ విద్యాశాఖలో అవినీతి పెరిగిపోతుందని.. అధికారులు లంచాలు తీసుకోవడం ప్రారంభించారని వస్తున్న ఫిర్యాదులపై కూడా మంత్రి సోని స్పందించారు. తాను శాఖలో అవినీతిని అసలు ఉపేక్షించనని.. ఎవరైనా అవినీతి అధికారులను పట్టుకొని తనకు అప్పగిస్తే.. రూ.5 లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తానని సోని తెలిపారు.