జేడీయూ యూత్ వింగ్ సమావేశానికి హాజరైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ వ్యక్తి బూటు విసిరాడు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే సదరు వ్యక్తిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. సీఎంపై దాడి చేసిన వ్యక్తి పేరు చందన్ కుమార్ అని, ఆయన ఔరంగాబాద్ వాసి అని పోలీసులు తెలిపారు. అగ్రకులంలో పుట్టినా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడని.. రిజర్వేషన్ వల్ల తనకు ఉపాధి దొరకలేదన్న కారణంతోటే ఆ వ్యక్తి సీఎంపై బూటు విసిరాడని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆందోళకారుడు సీఎంపై బూటు విసిరిన సమయంలో ఆ పార్టీలో ఇటీవలే చేరిన రాజకీయ సైద్ధాంతిక కర్త ప్రశాంత్ కిషోర్ కూడా వేదికపైనే ఉన్నారు. అయితే చందన్ కుమార్ సీఎంపై బూటు విసరగానే.. జేడీయూ కార్యకర్తలు ఆందోళనకారుడి పై దాడి చేశారు. తనను విచక్షణారహితంగా చితకబాదారు. అయితే పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు పరిస్థితిని కంట్రోల్‌లోకి తేవడానికి కార్యకర్తలను కూడా చెదరగొట్టారు. ఈ మధ్యకాలంలో బీహార్ రాష్ట్రంలో కుల రిజర్వేషన్లకు సంబంధించిన ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. 


పైగా సీఎం నితీష్ కుమార్ పై ఆందోళనకారుడు ఈ విధంగా చెప్పులు విసరడం ఇదే తొలి సారి కాదు. 2016లో కూడా పీకే రాయ్ అనే వ్యక్తి పాట్నాలో సీఎంపై చెప్పు విసిరాడు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది కాబట్టి.. తాను చెప్పులు విసిరానని ఆయన తెలిపాడు.