ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని తెలిపారు. ఆదివారం జరిగిన మన్ కి బాత్ లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. ముందుగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవాల్సిన రోజు అని.. డా. బిఆర్ అంబెడ్కర్ ను స్మరించుకున్నారు. 26/11 ముంబై  దాడుల్లో చనిపోయిన వారికి దేశ ప్రజలు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం దేశానికి పెనుసవాలుగా మారిందని.. భారత్ దేశ భద్రత విషయంలో అస్సలు వెనుకాడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు ను పురస్కరించుకొని ముస్లిం ప్రజలు ఈ ఈద్ ను జరుపుకుంటారని అన్నారు. రైతులు భూసార పరీక్షలకు ముందుకురావడం సంతోషదాయకమన్నారు. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు వేస్తే పంట దిగుబడి పెరుగుతుందని ప్రధాని తెలిపారు.