ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త మరియు బీజేపీ నేత గాలి జనార్థనరెడ్డి బళ్లారి ప్రాంతానికి వెళ్లి తన సోదరుడు సోమశేఖర రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేరని సుప్రీంకోర్టు తెలిపింది. జనార్థన రెడ్డి బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదని నిబంధనల్లో ఉంది. ఈ క్రమంలో ఆయన కోర్టులో పిటీషను దాఖలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు బళ్లారిలో 10 రోజులు ఉండేందుకు పర్మిషన్ ఇవ్వాలని.. అలాగే ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గాలి జనార్థనరెడ్డి అభ్యర్థనను ఏకే సిక్రి, అశోక్ భూషన్ల ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన బళ్లారి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం గాలి జనార్థనరెడ్డి సోదరులకు బీజేపీ టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 


అయితే జనార్థనరెడ్డి పార్టీ తరఫున కాకుండా, తన స్నేహితుడు శ్రీరాములుకి మద్దతు ఇవ్వడం కోసం ప్రచారం చేస్తున్నారని గతంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎడ్యూరప్ప చెప్పిన సంగతి తెలిసిందే.  2011, 2015 సంవత్సరాలలో గాలి జనార్థనరెడ్డి రెండు సార్లు మైనింగ్ స్కాంలో భాగంగా అరెస్టు అయ్యారు. 2015లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 12వ తేదిన కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.