శుక్రవారం (ఆగస్టు10, 2018) రాజ్యసభలో తలాక్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. తలాక్‌ బిల్లులో బెయిల్‌కు వీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయించగా.. ఈ బిల్లులో మార్పులకు రాజ్యసభ ఆమోదం తెలుపనుంది. కాగా నేటితో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్షణ తలాక్ విడాకుల విధానానికి వ్యతిరేకంగా కేంద్రం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లోక్‌సభలో ఆమోద ముద్ర పడినా రాజ్యసభలో చర్చకు రాలేదు. తలాక్‌ బిల్లులో సవరణలు చేయాల్సిందిగా పలు పార్టీలు సూచించగా.. కేంద్రం సవరణలు చేసేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయి.. సవరణలు చేసిన బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది.


ఈ సవరణ చేసిన తక్షణ తలాక్‌ బిల్లు ప్రకారం.. తలాక్‌ చెప్పిన భర్తలపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయొచ్చు. కానీ, అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్‌ తీసుకోవచ్చు. బాధితురాలు తన మైనర్‌ పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించమని కోర్టును అడగవచ్చు. అయితే.. తలాక్‌ చెప్పడం నేరమని, అలా చెప్పిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని గతంలో ఈ బిల్లులో పేర్కొన్నారు.


అటు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు అల్పాహార విందు ఇవ్వగా.. ఈ విందును కాంగ్రెస్‌ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. రఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌ వివాదంపై సభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ విందును కాంగ్రెస్ బహిష్కరించినట్లు తెలిసింది.