భారీ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి, 16 మందికి గాయాలు
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి!
ముంబైలో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. హింద్‌మత సినిమా థియేటర్‌కి సమీపంలో ఉన్న క్రిస్టల్ టవర్ అనే భవనంలో ఉదయం 12వ అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు 13, 14, 15 అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. లోపల చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బాగా ఆలస్యం కావడంతో క్షతగాత్రులు ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి జారుకున్నట్టు తెలుస్తోంది.
మొదట 10 ఫైర్ ఇంజన్లు ఘటనస్థలికి చేరుకోగా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో అగ్నిమాపక శాఖ అధికారులు మరో 10 ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఘటనాస్థలంలో అగ్నిమాపక శాఖ, డిజాస్టర్‌మేనేజ్ మెంట్ సిబ్బంది, ముంబై పోలీసులు సహాయ చర్యలు అందిస్తున్నారు.