కటిహార్: ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'వందే మాతరం' గీతం ఆలపించడానికి తిరస్కరించారనే కారణంతో ఓ ముస్లిం టీచర్‌పై స్థానిక యువత దాడికి పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహార్ జిల్లా అబ్ధుల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో ముస్లిం టీచర్‌పై స్థానికులు దాడికి పాల్పడుతుండగా చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల చేతిలో దాడికి గురైన టీచర్‌ని అప్జల్ హుస్సేన్‌గా గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిన అనంతరం మీడియాతో మాట్లాడిన అఫ్జల్ హుస్సేన్.. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తన మత విశ్వాసాలకు విరుద్ధంగా వందే మాతరం గేయం ఆలపించమన్నారని, అందుకు తాను నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. తాను అల్లాను మాత్రమే విశ్వసిస్తానని, వందే మాతరం అని అనాల్సిందిగా రాజ్యాంగంలో ఎక్కడైనా రచించారా అని అఫ్జల్ హుస్సేన్ ప్రశ్నించారు. తనను స్థానికులు చచ్చేటట్టు కొట్టారని, ఒకవేళ తాను చనిపోతే అందుకు ఎవరు బాధ్యులు అని అఫ్జల్ హుస్సేన్ ఆవేదన వ్యక్తంచేశారు. 


ఇదే విషయమై జిల్లా విద్యా శాఖ అధికారిని వివరణ కోరగా.. ఇప్పటివరకు అటువంటి ఘటన జరిగినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసి వుంటే, విచారణ జరిపే వాళ్లమేనని డీఈఓ తెలిపారు.