భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసనపై ఇచ్చిన నోటీసును రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు వెళ్తామని దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది కపిల్‌ సిబాల్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థను సంకట స్థితిలోకి నెట్టిందన్నారు. నోటీసులోని అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని సిబల్‌ ఆరోపించారు. ‘ఉపరాష్ట్రపతి నిర్ణయం సరైనది కాదు. చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. అభిశంసన నోటీసుపై విచారణ జరిపించిన తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ముందే తీసుకున్నారు. మేం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం’ అని చెప్పారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసినందుకు సీజేఐ దీపక్‌ మిశ్రా న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం ముందు తాను వాదించబోనన్నారు.


అంతకుముందు ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జ్‌ రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం.. ప్రజాస్వామ్యాన్ని వద్దనుకునేవారికి, కాపాడుకునేవారి మధ్య యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉందని విమర్శించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారని మరో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.


భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్‌మిశ్రాపై ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం తిరస్కరించారు. అభిశంసనపై చర్చకు అర్హమైన ప్రాధాన్యాంశాలేవీ నోటీసులో లేవని వెంకయ్య తెలిపారు. రెండురోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో జరిగిన చర్చల్లో అభిశంసన నోటీసును తిరస్కరించాలని న్యాయకోవిదులు సలహా ఇచ్చారు. ఈ మేరకు నోటీసును తిరస్కరిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ప్రకటించారు.