ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రపన్నిన మోదీ ప్రభుత్వం ఐఏఎస్‌లను రెచ్చగొట్టి వారిని వారి విధులు నిర్వర్తించుకోకుండా చేస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత రెండు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నివాసం ఎదుట ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ బుధవారం సైతం లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ఎదుట నుంచే ఓ ట్వీట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్.. మోదీ ఆదేశిస్తే కానీ ఐఏఎస్ అధికారులు విధుల్లో చేరరా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఇదంతా మోదీ సర్కార్ చేస్తోన్న కుట్రగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, తమ నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం ఎదుట ధర్నాకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బీజేపీ శ్రేణులు సైతం తమదైన స్టైల్లోనే ధీటుగా జవాబు ఇచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఢిల్లీ విభాగం బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి నేతృత్వంలో ధర్నా చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఢిల్లీలో ప్రజలు ఎదుర్కుంటున్న నీటి కొరత, విద్యుత్ కోతల సమస్యలు సత్వరమే పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఢిల్లీ వాసులను తీవ్రమైన నీటి కొరత, విద్యుత్ కోతలు వేధిస్తున్నాయని, ఢిల్లీ సర్కార్ ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.


 




అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట జరిగిన ఈ ధర్నాలో ఢిల్లీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్త, బీజేపీ ఎమ్మెల్యేలు మంజిందర్ సింగ్, జగదీష్ ప్రధాన్ పాల్గొన్నారు. అన్నింటికిమించి సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీపై తిరుగుబాటు జండా ఎగరేసిన ఆప్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా సైతం ఈ ధర్నాలో పాల్గొనడం మరో కొసమెరుపు.