నీట్, జేఈఈ పరీక్షలను ఇక నుండి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశంలోని అత్యున్నత మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను గతంలో సంవత్సరానికి ఒకసారే నిర్వహించేవారు. కానీ తాజా నిర్ణయంతో రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నేషనల్ టాలెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే నీట్,జేఈఈ, యూజీసీ నెట్, సీమ్యాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు జరుగుతాయి అని ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు ఈ పరీక్షలు అన్నీ కూడా సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో నిర్వహించేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల తమ స్కోరును మెరుగుపరుచుకొనే అవకాశం విద్యార్థులకు దొరుకుతుందని.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పరీక్షలు నిర్వహించడానికి తాము శ్రీకారం చుడుతున్నామని.. ఈ విధంగా పరీక్షలు నిర్వహించడం వల్ల పేపర్ లీకేజీ లాంటి సమస్యలు తలెత్తవని మానవ వనరుల శాఖ తెలిపింది. అలాగే విద్యార్థులు ముందస్తుగా ప్రాక్టీసు చేసుకోవడానికి ఆన్ లైన్‌లో మాక్ టెస్టు పేపర్లను కూడా అందుబాటులో ఉంచుతామని.. ఈ విధంగా చేయడం వల్ల ముందుగానే పరీక్ష ఎలా రాయాలన్న అంశంపై విద్యార్థులకు అవగాహన వస్తుందని శాఖ ప్రకటించింది. పై పేర్కొన్న పరీక్షలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు నేషనల్ టాలెంట్ ఏజెన్సీ వెబ్ సైటులో అందుబాటులో ఉంచుతామని కూడా శాఖ పేర్కొంది.