ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే జమ్ము కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కథువా రేప్ కేసు చాలా చిన్నది అని ఆయన అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక కథువా కేసుకు సంబంధించిన  ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన మాట్లాడారు. "ఇది చాలా చిన్న కేసు. అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. ఈ సమస్యతో పోల్చుకుంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం" అని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథువా కేసులో నిందితులకు మద్దతు ఇచ్చిన ర్యాలీలో పాల్గొన్నఇద్దరు మంత్రులు గతంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం కూడా కథువా కేసును చిన్న కేసుగా పేర్కొనడం గమనార్హం. అయితే ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలకు సంబంధించి మళ్లీ వివరణ ఇచ్చారు. "కథువా కేసు విచారణలో ఉంది. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతుంది. నేను మాత్రం ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని మాత్రమే అన్నాను. నా మాటలను వక్రీకరించవద్దు" అని అన్నారు. 


అయితే తాజా మంత్రివర్గంలో మార్పులతో పాటు కథువా కేసుకు సంబంధించిన విషయాన్ని బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ రెండు అంశాలకు సంబంధం లేదని తెలిపారు. "బీజేపీ, పీడీపీ సంయుక్త ప్రభుత్వం జమ్ము కాశ్మీరులో మూడేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా మేము మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావించాం. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించాం. అంతే తప్ప, ఇతరత్రా కారణాలు ఏమీ లేవు" అన్నారు