అది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే..!
ఢిల్లీలో జనాలు కాలుష్య ప్రభావంతో ఊపిరాడకుండా సతమతమవుతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. ఆ వైఖరి అనేది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుందని జాతీయ మానవ హక్కుల కమీషన్ అభిప్రాయపడింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ పరిరక్షణ శాఖతో పాటు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది.
అలాగే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల పేర్ల మీద కూడా నోటీసులు పంపించబడ్డాయి. "ప్రజలు ప్రాణాలరచేత పట్టుకొని ప్రమాదపుటంచులలో ఉన్నారు. ఎంతో టెక్నాలజీ ఉన్నా వాటిని ఆధారంగా చేసుకొని, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకొనే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించడంలో విఫలమయ్యాయి. అలా చేయడం అనేది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది.
ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో ఆడుకొనే హక్కు మీకెవరిచ్చారు.." అని కమీషన్ ఆ నోటీసుల్లో ప్రభుత్వాలను తూర్పారపట్టింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులపై వస్తున్న ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించిన కమీషన్, తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
"ఒక ప్రణాళిక ప్రకారంగా అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలా ఈ సమస్యలను నివారించాలో నిపుణులతో సమావేశమై ప్రభుత్వాలు చర్చించాల్సిన ఆవశ్యకత కనబడుతోంది" అని కమీషన్ తెలిపింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలిలో స్వచ్ఛత శాతం గణనీయంగా తగ్గింది. నాణ్యత కూడా బాగా పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కమీషన్ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ.. నోటీసులు పంపించింది.