లోక్ సభ ఎన్నికలు: ఎల్.కె. అద్వాని, ఎం.ఎం. జోషిలకు లైన్ క్లియర్ !
లోక్ సభ ఎన్నికలు: ఎల్.కె. అద్వాని, ఎం.ఎం. జోషిలకు లైన్ క్లియర్ !
న్యూఢిల్లీ: 75 ఏళ్ల వయస్సు పైబడి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీజేపీ నేతలకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. 75 ఏళ్లు పైబడిన నేతలకు సైతం టికెట్ ఇవ్వాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీలో కురువృద్ధులైన ఎల్.కె. అద్వాని, మురళి మనోహర్ జోషి, శాంతా కుమార్ వంటి వారికి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వంటి అగ్రనేతలు హాజరైన ఈ సమావేశంలోనే సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చే అంశంపై సైతం చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అద్వాని ప్రస్తుతం 91 ఏళ్ల వయస్సులో లోక్ సభలో సీనియర్ సభ్యుడిగా వున్నారు. 1991 నుంచి గాంధీ నగర్ నుంచి అత్యధిక మెజార్టీలతో గెలుస్తూ వస్తోన్న అద్వాని ఈ ఎన్నికల్లో కూడా పోటీచేసినట్టయితే, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన వృద్ధ ఎంపీగా ఆయన మరో రికార్డు సొంతం చేసుకోనున్నారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన రామ్ సుందర్ దాస్ 88 ఏళ్ల వయస్సులో హాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన ఓల్డెస్ట్ ఎంపీ రికార్డు రామ్ సుందర్ దాస్ పేరుపై వుంది.
బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎల్.కె. అద్వాని, ఎంఎం జోషి(84) వంటి నేతలకే కాకుండా శాంతా కుమార్(85), కల్రాజ్ మిశ్రా (77), భగత్ సింగ్ కొశ్యారి (77) వంటి నేతలకు సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మార్గం సుగుమమైంది.