No Live of Ayodhya: అయోధ్య ఉత్సవం వేళ తమిళనాడులో కలకలం.. రేగిన రాజకీయ దుమారం
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా మారింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అధికార ఎన్డీయే కూటమి హాజరవుతుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి బహిష్కరించింది. ఫలితంగా ఆయా కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ ఉత్సవానికి అంటిముట్టనట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.
Ayodhya Pran Pratishtha: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే ఆరోపిస్తోంది. భక్తిని రాజకీయాలకు వాడుకుంటోందని ఇటీవల ఆ పార్టీ యువ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే కూడా అయోధ్య ఉత్సవానికి గైర్హాజరు కావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన అయోధ్య జరుగుతున్న ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు కూడా తమిళనాడులో ప్రత్యక్ష ప్రసారం కాకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం అయోధ్య ఉత్సవాలు ఏ తమిళ చానళ్లల్లోనూ ప్రత్యక్ష ప్రసారం జరపరాదని ప్రభుత్వం ఆదేశించినట్లు విమర్శలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. జనవరి 22వ తేదీన తమిళనాడులోని 200 రామాలయాల్లో ఎలాంటి పూజాది కార్యక్రమాలు, భజనలు, ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమం చేపట్టడం లేదు. కొందరు భక్తిపూర్వకంగా సొంతంగా చేసుకుంటున్న కార్యక్రమాలను కూడా పోలీసులు ఆపివేస్తున్నారు. దీంతో ఆయా సంఘాలు భయాందోళన చెందుతున్నారు. హిందూ వ్యతిరేక ద్వేషభావాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా' అని కేంద్ర మంత్రి నిర్మల పోస్టు చేశారు.
'హృదయాన్ని ద్రవించే సన్నివేశాలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. భజనలు, పూజా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయోధ్య ఉత్సవం వేళ ప్రసారాలు రాకుండా కుటిల చర్యలకు తమిళనాడు ప్రభుత్వం పాల్పడుతోంది' అని నిర్మల సీతారామాన్ ఆరోపించారు. కాగా ఈ విమర్శలపై డీఎంకే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తిప్పికొట్టారు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.
Also Read: Ayodhya Holiday: అయోధ్య ఆలయంపై డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు
Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్ షర్మిలకు ఘోర అవమానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook