నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైనదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమకు వేసిన ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చాలని ముగ్గురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్ధించింది. నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు అన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తమకు సంతోషాన్నిచ్చిందని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2012 డిసెంబరు 16న ఢిల్లీలో తోటి విద్యార్థితో కలిసి వెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో బాధితురాలిని 'నిర్భయ'గా పేర్కొంటూ దేశమంతా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు హోరెత్తాయి. నిర్భయ దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో ఒకరు మైనర్ కావడంతో.. మూడేళ్ల శిక్ష అనంతరం అతడు‌ 2015లో విడుదలయ్యాడు. విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబరులో మిగతా నలుగురిని కోర్టు దోషులుగా తేల్చి.. 2017 మే 5న వారికి మరణ శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ దోషుల్లో ముగ్గురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయగా.. విచారించిన కోర్టు ఉరిశిక్షే సరైనదని తేల్చి చెప్పింది.