కర్ణాటక రాష్ట్ర సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరొక 30 నెలలు అధికారం చేపట్టే అవకాశముందని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు. అలాంటి ఒప్పందాలేవీ జరగలేదని ఆయన చెప్పారు. 2006లో కుమారస్వామి ఇలాంటి ఒప్పందమే బీజేపీ ప్రభుత్వంతో చేసుకున్న క్రమంలో తాజాగా వస్తున్న వార్తలు పలువురిలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఇలాంటి ఒప్పందమే బీజేపీతో జరిగినప్పుడు.. కుమారస్వామి  బీఎస్ యడ్యూరప్పకి బాధ్యతలు అప్పగించడానికి ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2008లో బీజేపీ స్వయంగా అధికారంలోకి వచ్చింది. కాగా, ఈ రోజు కుమారస్వామి మాట్లాడుతూ ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటామని తెలిపారు. 


ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఈనెల 21న కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్దంతి కూడా ఉండటంతో 23వ తేదికి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ రోజు గవర్నరు కుమారస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానాన్ని పంపారు.


కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఆర్థికశాఖను కూడా కుమారస్వామి నిర్వర్తించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.పరమేశ్వరకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపైనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించేందుకు కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.