భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్ గురువారం రాజ్యసభ ఎంపీగా 'భారతదేశంలో క్రీడా ఔన్నత్యం' అనే అంశంపై ప్రసంగించాల్సి ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి మూలంగా సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తడం వల్ల సచిన్ మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారు. ఆ అంశంపై సచిన్ అభిమానులు ఘాటుగానే స్పందించారు. ఆయనకు రాజ్యసభలో ఘోరమైన అవమానం జరిగిందని అభిప్రాయపడ్డారు. అయితే రాజ్యసభలో చేయాల్సిన ప్రసంగాన్ని సచిన్ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు తన అభిమానులందరితోనూ పంచుకున్నారు. ఆ ప్రసంగంలో ఒక క్రీడాకారుడిగా భారతదేశంలో క్రీడల ఔన్నత్యాన్ని పెంచడానికి దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రపంచాన్ని మార్చగల శక్తి క్రీడలకు ఉంది. క్రీడలకు జనాల్లో స్ఫూర్తిని నింపగల సత్తా కూడా ఉంది. భారతదేశాన్ని క్రీడలను ప్రేమించే దేశంగా మరియు క్రీడలను ప్రోత్సహించే దేశంగా చూడాలన్నదే నా అభిమతం. మీరందరూ నా కల నెరవేరడానికి చేయూతనిస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు కూడా తమ ఇండ్లలో బాలురతో పాటు బాలికలకు కూడా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రయత్నించాలి' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది