ఒడిషా: నవీన్ పట్నాయక్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సోషల్  మీడియా పేజీలకు ఒడిషా సర్కార్ ఫ్రీ లైసెన్స్ జారీ చేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. సీఎం కార్యాలయ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ మనోజ్ కుమార్ మిశ్రా సోమవారం దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేశారు. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఎవరైనా సరే ఈ పేజీల్లోనూ కంటెంట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 


తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధించిన ఫేస్‌బుక్ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం యుట్యూబ్‌లోని కంటెంట్‌ను ఎవరైనా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వం సోషల్ మీడియా పేజీలను ఫ్రీ లైసెన్స్ ద్వారా వినియోగించుకునే వెసలుబాటు కల్పించింది. కాగా భారత్ దేశంలోనే ఈ విధానాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఒడిషా నిలిచింది.