న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో రోజు సమావేశాలలో భాగంగా బుధవారంనాడు సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించగా బీజేపీ తరపున ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. వివిధ పక్షాల సభ్యులు మద్దతు ప్రకటించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ స్థానానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తదితరులు దగ్గరుండి తీసుకువెళ్లగా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు గల్లా జయదేవ్‌, నామా నాగేశ్వరరావు, మిథున్ రెడ్డి తదితరులు బిర్లాకు అభినందనలు తెలిపిన వారిలో వున్నారు.


రాజస్తాన్‌లోని కోట లోక్ సభ స్థానం నుంచి ఓం బిర్లా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కోట స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌నారాయణ్ మీనాపై 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో బిర్లా గెలుపొందారు.