సముద్రంలో కూలిన ఓఎన్‌జీసీ హెలిక్యాప్టర్.. నలుగురి దుర్మరణం
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ (ఓఎన్‌జీసీ) సంస్థ విధులలో భాగంగా ఏడుగురితో ముంబై నుంచి బయల్దేరిన పవన్‌హన్స్ హెలీక్యాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దినిమిషాల్లోనే ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో కూలిపోయింది. శనివారం ఉదయం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాలకే పవన్ హన్స్ హెలీక్యాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయని ముంబై ఏటీసీ ( ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలీక్యాప్టర్లు, స్పీడ్ బోట్ల ద్వారా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే సముద్రాన్ని జల్లెడ పడుతున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓ చోట కూలిపోయిన హెలీక్యాప్టర్ శకలాలని గుర్తించారు. శకలాల్లో నాలుగు మృతదేహాలని వెలికితీసిన కోస్ట్ గార్డ్ సిబ్బంది మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇండియన్ నేవి హెలీక్యాప్టర్లు, ఓఎన్‌జీసీ హెలీక్యాప్టర్లు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి.
ముంబైలోని జుహు నుంచి ఉదయం 10:20 గంటలకి బయల్దేరిన పవన్ హన్స్ హెలీక్యాప్టర్ ఓఎన్‌జీసీ నార్త్ ఫీల్డ్ లో ఉదయం 10:58 గంటలకు ల్యాండ్ కావాల్సి వుంది. కానీ జుహు నుంచి బయల్దేరిన హెలీక్యాప్టర్ తో కాసేపట్లోనే ఏటీసీకి సంబంధాలు తెగిపోవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఓఎన్‌జీసీ హెలీక్యాప్టర్ అదృశ్యమైందనే వార్త తెలుసుకున్న ఆ సంస్థ ఉన్నత అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి హెలీక్యాప్టర్ కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్ స్వయంగా ముంబై చేరుకుని ప్రస్తుత పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై స్పందించిన సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రస్తుతం తాను కూడా పరిస్థితిని సమీక్షించేందుకు ముంబై వెళ్తున్నానని అన్నారు. ఇదే విషయమై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించానని, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాల నుంచి సహకారం అందుతోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంచేశారు.