Onion Price Hike: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో కిలో 60 రూపాయలు
Onion Price Hike: మొన్న టొమాటో. ఇప్పుడు ఉల్లి ఆకాశాన్నంటుతున్న ధరలతో కన్నీరు తెప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి నడ్డి విరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Onion Price Hike: దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్‌లో ఒకేసారి 57 శాతం ధర పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా చాలా ప్రాంతాల్లో కిలో ఉల్లి పాయలు 50-60 రూపాయలు పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా.
దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు కన్నీరు రప్పిస్తున్నాయి. బారీగా పెరిగిన ధరలతో సామాన్యుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది ఇదే సమయంలో కిలో ఉల్లిపాయలు 30 రూపాయలుండగా ఇప్పుుడు ప్రాంతాన్ని బట్టి కిలో 50-60 రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో కిలో ఉల్లిపాయలు 47-50 రూపాయలు పలుకుతుంటే ఏపీ, తెలంగాణలో 60 రూపాయలు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పరిస్థితి ఇదే. రోజురోజుకూ ఉల్లి ధరలు మరింతగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. మొన్నటి వరకూ టొమాటో ఎలా ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఉల్లి ఆ స్థాయికి చేరుకుంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిల్వ చేసిన ఉల్లిపాయల్ని సబ్సిడీపై విక్రయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు నిల్వ ఉంచిన ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు తీసుకుంటోంది. నిల్వ ఉంచిన ఉల్లిని ధరలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ఆగస్టులోనే ప్రారంభించామని, ఇప్పటి వరకూ 22 రాష్ట్రాలకు 1.7 లక్షల టన్నుల ఉల్లిని సరఫరా చేశామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి తెలిపారు. నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) ఆధ్వర్యాన రిటైల్ ఉల్లి అమ్మకాల్ని చేపడుతున్నారు.
ఉల్లి ధరలు పెరగడానికి కారణమేంటి
వాతావరణంలో ఈసారి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి నాట్లను వేయడంలో ఆలస్యమైంది. ఫలితంగా ఇప్పటికే చేతికి అందాల్సిన పంట అందలేదు. అటు రబీలో పండించిన స్టాక్ దాదాపుగా అయిపోయింది. దాంతో డిమాండ్, సప్లై ఛైన్ దెబ్బతినడంతో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. అటు హోల్ సేల్, ఇటు రిటైల్ రంగంలో సైతం ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి NCCF, NAFED కలిసి 5 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేసింది. రానున్న రోజుల్లో మరో 2 లక్షల టన్నుల ఉల్లి నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉల్లినే ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
Also read: Manipur: మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పే, ఇంటర్నెట్ బ్యాన్ మరోసారి పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook