తమిళనాడులోని తేని జిల్లాలోని కురంగణి ప్రాంతపు అడవుల్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఈ  ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు ప్రమాదపుటంచుల్లో చిక్కుకోవడం గమనార్హం. ఆ అడవులకు విహారయాత్ర నిమిత్తం వచ్చిన విద్యార్థులు అకస్మాత్తుగా తమ కళ్ళ ఎదుటే మంటలు చెలరేగడంతో ఎటు వెళ్లాలో తోచని పరిస్థితిలో సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈదురుగాలుల వలన మంటలు వేగంగా దూసుకువెళ్తూ.. అవి ఒక కిలోమీటర్ వరకూ వ్యాపించాయి. ఇంతలో సమాచారాన్ని అందుకున్న పోలీసులు విద్యార్థులను మంటల నుండి రక్షించేందుకు అదనపు బలగాల కోసం ముఖ్యమంత్రి పళనీస్వామిని సంప్రదించారు. ఆయన విద్యార్థులను కాపాడాలంటే.. వైమానిక దళం అవసరముందని గ్రహించి కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమాచారాన్ని చేరవేశారు.



తాజా వార్తల ప్రకారం  రంగంలోకి దిగిన వైమానికి దళ అధికారులు దాదాపు 12 మంది విద్యార్థులు ప్రమాదం నుండి తప్పించుకొని.. కొండల వైపు పయనిస్తున్నట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. అలాగే నిర్మలా సీతారామన్ సూచన మేరకు రెండు హెలీకాప్టర్లు కోయంబత్తూరు సులూర్ బేస్ ప్రాంతం నుండి కురంగణి అడవుల వైపు విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి వెళ్లిన్నట్లు సమాచారం.


అలాగే ఓ మెడికల్ టీమ్‌ను ఆంబులెన్సుతో సహా అడవులకు పంపారు. ప్రమాదం నుండి బయటపడిన 12 మంది విద్యార్థులు స్థానిక గిరిజనుల సహాయంతో వేరే మార్గం నుండి అడవి బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. అలాగే ఇప్పటి వరకూ ఆచూకీ లభించని ఇతర విద్యార్థులను కాపాడడానికి జిల్లా కలెక్టర్ వైమానిక దళం సహాయం తీసుకోవాలని రక్షణమంత్రి సూచించారు. ఇప్పటికే అడవుల్లో పరిస్థితిని సమీక్షించడానికి జిల్లా ఎస్పీ వి భాస్కరన్‌తో పలువురు పోలీసుల అధికారులు కురంగణి అడవులకు బలగాలతో సహా వెళ్లారు.