న్యూడిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ వైపునకు రావడాన్ని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన రాడార్లు పసిగట్టాయా అంటే అవుననే తెలుస్తోంది. భారత యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు సిద్ధమయ్యేలోపే భారత యుద్ధ విమానాలు బాలాకోట్, ముఝఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులు విడిచి తిరిగొచ్చేశాయని సమాచారం. భారత యుద్ధ విమానాలు పాక్ గగనతలంపైకి వచ్చాయని గుర్తించి ప్రతిఘటించేలోపే, భారత వాయుసేన తమ పని ముగించుకుని తిరిగి స్వదేశానికి తిరిగిరావడం విశేషం. 1971 యుద్ధం తర్వాత భారత వైమానిక దళం పాక్ సరిహద్దులు దాటి వెళ్లడం ఇదే తొలిసారి. 


పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై పోరును తీవ్రతరం చేసిన భారత్.. మంగళవారం జరిపిన వైమానిక దాడులను ప్రపంచదేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లకు వివరించింది. శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, టర్కీ, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు సైతం ఈ సర్జికల్ దాడులపై సమాచారం అందించి భారత్ తన పరిపక్వతను చాటుకుంది.