అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు కలకం రేపాయి. ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం ముగిసిన వెంటనే ఓ అమూల్య అనే యువతి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసింది. స్టేజీ దిగబోతున్న ఒవైసీ వెంటనే పరుగున వచ్చి ఆ యువతిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేదికమీద ఉన్న వారు సైతం ఆమెను అడ్డుకుని చేతిలో మైక్ లాక్కునే ప్రయత్నం చేయగా హిందుస్థాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేసింది.
సేవ్ కాన్‌స్టిట్యూషన్ పేరుతో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఫిబ్రవరి 20న ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం వైఖరిని, ఈ విధానలను వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. అనంతరం ఆయన స్టేజీ దిగబోతుండగా అమూల్య అనే యువతి మైక్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసింది. ఒవైసీ తిరిగొచ్చి ఆమెను అడ్డుకునే యత్నంగా చేయగా హిందూస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసింది. మైక్ లాక్కున్న తర్వాత కూడా పాకిస్థాన్ జిందాబాద్ అని అమూల్య గట్టిగా అరవడం గమనార్హం. పోలీసులు బలవంతంగా ఆమెను వేదికమీద నుంచి కిందకి తీసుకెళ్లారు.
Also Read: ఇక్కడే ఉంటా .. దమ్ముంటే నన్ను కాల్చుకోండి..
పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలపై అసదుద్దీన్ స్పందించారు. ‘ఆ యువతి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. నేనుగానీ ఇక్కడి ఇతర పార్టీల నేతలుగానీ ఆమెను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే.. ఇక్కడికి వచ్చేవాడిని కాదు. మనం భారత్ తరఫున నిలవాలి. అంతేకానీ ప్రత్యర్థి పాకిస్థాన్‌కు మద్దతు తెలపరాదు. భారత్‌ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని’ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివరించారు.