ఓవైపు భారత్‌తో చర్చలకు సిద్ధం అని ప్రపంచానికి చెబుతూనే, మరోవైపు భారత్‌తో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్‌కి చెందిన ఓ హెలీక్యాప్టర్ జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో భారత సరిహద్దులు దాటి 700 మీటర్లలోపు భారత గగనతలంలోకి దూసుకొచ్చి కొన్నినిమిషాల పాటు భారత గగనతలంలోనే చక్కర్లు కొట్టి వెళ్లడం కలకలం సృష్టించింది. పాక్ హెలీక్యాప్టర్‌ భారత గగనతంలోకి రావడాన్ని గమనించిన ఇండియన్ ఆర్మీ బలగాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరపడంతో ఆ హెలీక్యాప్టర్‌ అటు నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్లిపోయినట్టుగా తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. 



పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్న భారత్.. ఈ ఉల్లంఘనను సైతం పాక్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉంది. ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రక్షణ శాఖ వర్గాల్లో చర్చనియాంశమైంది.