భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడంలో పాకిస్తాన్ రాన్రాను తన స్థాయిని మరీ దిగజార్చుకుంటోంది. భారత సైనికులపై దాడికి ఉసిగొల్పేందుకు పాకిస్తాన్‌లోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ఐఎస్ఐ ప్రత్యేక శిక్షణ అందించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే విధంగా పాక్‌లో దేశవ్యాప్తంగా వున్న జైళ్లలోని ఖైదీలకు ఇంటర్-సర్వీసెస్ ఇంటెలీజెన్స్ వర్గాలు ప్రత్యేక తర్ఫీదు అందిస్తున్నట్టు జీ న్యూస్‌కి విశ్వసనీయవర్గాలు సమాచారం అందించాయి. భారత్‌పై దాడులకు దిగడంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న ఐఎస్ఐ.. తాజాగా పాక్ జైళ్లలో ఖైదీలుగా మగ్గుతున్న గజ దొంగలు, కరడుగట్టిన నేరస్తులను ఎంచుకుని వారికి యుద్ధ వ్యూహాలు నేర్పిస్తున్నట్టు సదరు వర్గాలు తెలిపాయి. జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి వున్న భారత సైనికుల స్థావరాలపై దాడులకి ఈ ఖైదీలను ఉపయోగించుకోవాలని ఐఎస్ఐ భావిస్తోందట. ఖైదీల శిక్షణకు అవసరమైన యుద్ధ సామాగ్రినిని సైతం ఐఎస్ఐనే స్వయంగా సమకూర్చుతోందనేది సదరు వర్గాలు అందించిన సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖైదీలకు పూర్తిస్థాయిలో శిక్షణ పూర్తయిన అనంతరం, పాక్ ఆర్మీకి చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) పర్యవేక్షణలో వీరిచేత దాడులు చేయించాలనేది ఐఎస్ఐ కుట్రగా తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలపై దాడులకి పాల్పడే ఖైదీలకు బార్డర్ యాక్షన్ టీమ్ బృందాలు దిశానిర్దేశం చేయనున్నాయని, నిర్దేశించిన లక్ష్య సాధనలో ఖైదీలు సాధించిన విజయం ఆధారంగా వారికి జైలు శిక్ష తగ్గించడంతోపాటు ఆర్థికంగా నగదు ప్రోత్సాహాలు సైతం అందించే విధంగా ఐఎస్ఐ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. 


గతంలో అనేక సందర్భాల్లో భారత సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ఐ ఎన్నో కుట్రలు పన్నిన సంగతి తెలిసిందే. భారత్‌లో అంతర్గతంగా అశాంతి సృష్టించేందుకు పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమానికి మళ్లీ ఊపిరిలూదేందుకు సైతం ఐఎస్ఐ ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నట్టు ఇటీవల పలు వార్తా కథనాలు వెలువడటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.