న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ను లింక్ చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీనే తుది గడువు అని సీబిడీటి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) విభాగం అధికారులు తెలిపారు. ఆధార్‌ లేని పాన్‌ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏఏ (2) ప్రకారం రద్దు చేస్తామని సీబీడిటి అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 30 తర్వాత ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారు.. అప్పుడు పేర్కొనే ఆధార్‌ సంఖ్య మేరకు కొత్త పాన్‌ నంబర్ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పాన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ను జతచేసుకోవాల్సిందిగా సీబీడిటి అధికారులు సూచించారు.


గతంలో ఇదే ఏడాది మార్చి 31 వరకే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ని జత పర్చుకోవాల్సిందిగా చెప్పిన అధికారులు.. ఆ తర్వాత సెప్టెంబర్ 30 వరకు తుది గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.