జీన్స్ ధరించే అమ్మాయిలు కాలేజీకి రావద్దు..!
బీహార్ రాజధాని పాట్నాలో మగధ్ కళాశాల యాజమాన్యం.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ఒక చిత్రమైన ఆదేశం జారీ చేసింది.
బీహార్ రాజధాని పాట్నాలో మగధ్ కళాశాల యాజమాన్యం.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ఒక చిత్రమైన ఆదేశం జారీ చేసింది. జీన్స్ ప్యాంటులు, పటియాలా సూట్స్ లేదా జీన్స్ కోటులు ధరించి క్యాంపస్‌లోకి అడుగుపెట్టవద్దని.. అలాగే మొబైల్ ఫోన్లు కూడా కాలేజీలోకి అనుమతించేది లేదని ప్రకటన జారీ చేసింది. అయితే తాము ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఎలాంటి దుస్తులు ధరించకూడదో కాలేజీ నిర్ణయించడమేమిటని విద్యార్థులు ప్రశ్నించడంతో ఈ వార్త జాతీయ మీడియా దృష్టిలో పడింది. దుస్తులపై కూడా నియంత్రణ విధించడం అనేది కూడా వివక్ష క్రిందకే వస్తుందని.. విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే ఇలాంటి ప్రకటనలు కాలేజీ జారీ చేయడమేమిటని విద్యార్థినులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
క్యాంపస్‌లో మర్యాదగా, సభ్యతగా వ్యవహరించడం ముఖ్యమని.. అంతే గానీ కేవలం ఇలాంటి దుస్తులు వేసుకోవడం వల్లే కల్చర్ చెడిపోతుందని భావించడం సబబు కాదని విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి... ఎలాంటి దుస్తులు వేసుకోకూడదు అనేది వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాలలో యాజమాన్యం జోక్యం చేసుకోకపోవడం మంచిదని కూడా విద్యార్థినులు తెలిపారు. అయితే అనేక సంవత్సరాలుగా కాలేజీలో ఈ సంప్రదాయం ఉందని.. విద్యార్థినులు కూడా ఎప్పుడూ ప్రశ్నించలేదని ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం.