హవ్వ!! పెట్రోల్ ధర తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసానే
ఐఓసీఎల్ పొరపాటు.. ఆవిరైన వాహనదారుల ఆశలు
కర్ణాటకలో ఎన్నికల అనంతరం నిత్యం వరుసగా పెరుగుతూపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు 16 రోజుల తర్వాత బుధవారం తగ్గుముఖం పట్టాయని జనం పట్టరాని సంతోషం వ్యక్తంచేశారు. బుధవారం నాటి ఇంధనం ధరల సమీక్ష అనంతరం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కి 60 పైసలు, ముంబైలో పెట్రోల్ ధర లీటర్‌కి 59 పైసలు తగ్గినట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే ఢిల్లీలో డీజిల్ ధర లీటర్‌కి 56 పైసలు, ముంబైలో డీజిల్ ధర లీటర్‌కి 59 పైసలు తగ్గినట్టుగా ఐఓసీఎల్ స్పష్టంచేసింది. నిత్యం అంతకంతకూ పెరుగుతున్న ఇంధనం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. కానీ ఎండకు పెట్రోల్ ఆవిరైనట్టుగా వాహనదారులకు కూడా ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే పెట్రోల్ ధర తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే.
అవును, మీరు చదివింది నిజమే! పెట్రోల్ ధరల సమీక్ష అనంతరం ధరలని ప్రకటించడంలో పొరపాటు జరిగిందని, పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గితే, 60 పైసలు తగ్గినట్టుగా వెబ్ సైట్ లో పేర్కొనడం జరిగిందని తాజాగా ఐఓసీఎల్ ప్రకటించింది. సంస్థలో సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని ఐఓసీఎల్ ఉన్నతాధికార వర్గాలు వివరణ ఇచ్చినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన ఈ వివరణ చూసి మళ్లీ షాక్ అవడం వాహనదారుల వంతయ్యింది.