జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కిందకు పెట్రోల్ డీజిల్ వస్తే వాటి ధరలు విపరీతంగా తగ్గే ఛాన్స్ ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరమని.. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకునేనా...


జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ వస్తే... వాటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో, ఈ నిర్ణయం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. అందుకే, రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తాజా ప్రతిపాదనపై రాష్ట్రాలు ఏ మేరకు స్పందిస్తాయనేది గమనార్హం. 


పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందున మోడీ సర్కార్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ ను తగ్గించాయి. మెజార్టీ రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో  భారీగా ఆదాయాన్ని సమకూర్చే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.