నిత్యం పెరుగుతూపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల పరిణామమే దేశవ్యాప్తంగా నేడు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమికి కారణమయ్యాయని అన్నారు జనతా దళ్ యునైటెడ్ (జేడీయు) అగ్ర నేత కేసీ త్యాగి. బీహార్‌లో అధికార పార్టీ అయిన జేడీయు తమ మిత్రపక్షమైన బీజేపీకి ఇటీవల కాలంలో తరచుగా చురకలంటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి సర్ఫరాజ్ ఆలం చేతిలో జేడీయు అభ్యర్థి ముర్షిద్ ఆలం 40,000 ఓట్ల తేడాతో ఓడిపోవడానికి కారణం కూడా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలే అని కేసీ త్యాగి అభిప్రాయపడ్డారు. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలను ఇకనైనా తగ్గించాల్సిందేనని కేసీ త్యాగి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాల్లో చాలా చోట్ల బీజేపీ ఓటమి చెందడంపై స్పందిస్తూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడే క్రమంలో కేసీ త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు.


జోకిహట్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ 40,000 ఓట్ల తేడాతో విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, బీహార్ మాజీ ఉప-ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందిస్తూ... తమ ప్రత్యర్థి ముర్షిద్ ఆలంకి వచ్చిన మొత్తం ఓట్లకన్నా ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఆలంకి ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఎద్దేవా చేశారు.