ఆల్‌టైం రికార్డుకు చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు; లీటరు పెట్రోల్ ధర రూ.84.07!
పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్‌టైం రికార్డుకు చేరుకున్నాయి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్‌టైం రికార్డుకు చేరుకున్నాయి. ఆదివారం పెట్రోల్ ధర లీటరు రూ.76.24, డీజిల్ 67.57 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 33 పైసలు పెరిగిపోయింది. రోజువారీ ధరల పెంపుదల అమల్లోకి వచ్చాక ఇంతలా ధర పెరగడం ఇదే తొలిసారి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం డీజిల్‌పై 26 పైసలు పెంచినట్లు తెలిసింది. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్ బట్టి రాష్ట్రాల రాష్ట్రాల మధ్య ధరలు మారుతూ ఉంటాయి. దేశంలో ఉన్న మెట్రోలు, రాష్ట్ర రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువ.
గత వారం రోజుల నుంచి ఇప్పటివరకు చమురు కంపెనీలు పెట్రోల్ మీద రూ.1.61, డీజిల్ మీద రూ.1.64 పెంచారు. ముంబాయిలో లీటర్ పెట్రోల్ గరిష్టంగా రూ.84.07గా నమోదైంది. భోపాల్‌లో లీటరు పెట్రోల్ రూ. 81.83, పాట్నాలో రూ.81.73, హైదరాబాద్‌లో రూ.80.76, శ్రీనగర్‌లో రూ.80.35, కోల్‌కతాలో రూ.78.91, చెన్నైలో రూ.79.13కి ఎగబాకింది. పనాజీ(గోవా)లో లీటర్ పెట్రోల్ ధర రూ.70.26గా నమోదైంది. హైదరాబాద్‌లో డీజిల్ గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర 73.45 రూపాయలు కాగా త్రివేండ్రంలో రూ. 73.34గా ఉంది.
డీజిల్ ధర రూ.70 దాటిన నగరాలు (లీటర్ ధరలు): రాయ్పూర్‌లో రూ.72.96, గాంధీనగర్‌లో రూ.72.63, భువనేశ్వర్‌లో రూ.72.43, పాట్నాలో రూ.72.24, జైపూర్‌లో రూ.71.97, రాంచీలో రూ. 71.35, భోపాల్‌లో రూ. 71.12, శ్రీనగర్‌లో రూ.70.96, ముంబాయిలో డీజిల్ లీటరు 71.94 రూపాయలు, కోల్‌కతాలో రూ. 70.12, చెన్నైలో రూ .71.32గా నమోదైంది. కాగా పోర్ట్ బ్లెయిర్‌లో డీజిల్ చౌకగా రూ .63.35కే లభిస్తోంది.
ఇప్పటికే వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల కారణంగా కొద్దిరోజులపాటు ఇంధన ధరల పెంపును వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా కంపెనీల లాభాల్లో కోతపడింది. ఇప్పుడు వాటిని పూడ్చుకునే ప్రయత్నించవచ్చని ఆర్థకరంగ నిపుణులు పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఇంధన సరఫరా కంపెనీల లాభాల స్థాయిని అందుకోవాలంటే మరో రూ.4 పెంచాల్సి ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు గత సోమవారం ఇందన ధరల సమీక్షను మళ్లీ మొదలుపెట్టాయి.