వరుసగా 14వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు !
తగ్గుతున్న పెట్రోల్ ధరలు
రెండు వారాల క్రితం వరకు పెరగడమే తప్ప తగ్గడం తెలియని పెట్రోల్ ధరలు గత రెండు వారాలుగా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడం వాహనదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వరంగ ఇందన సంస్థ ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారిక వెబ్‌సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం మంగళవారం పెట్రోల్‌పై లీటర్‌కి 15 పైసలు, డీజిల్‌పై 10పైసల చొప్పున ధరలు తగ్గుముఖంపట్టాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 15 పైసలు తగ్గినట్టు ఐఓసీఎల్ పేర్కొంది. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 76.43, కోల్‌కతాలో రూ.79.10, ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33 ఉంది. డీజిల్ ధర విషయానికి వస్తే ఢిల్లీ, కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధరలు 10 పైసలు తగ్గగా ముంబై, చెన్నైలలో లీటరుకు 11 పైసలు తగ్గింది.
ఇదిలాఉంటే హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి రూ.80.96గా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కి 11 పైసలు తగ్గి రూ. 73.75 కి చేరుకుంది. గత 14 రోజులుగా తగ్గిన మొత్తం పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ.2 కాగా డీజిల్ ధరల్లో రూ1.50 తగ్గుదల చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వ రంగ ఇందన సంస్థలు ప్రతీరోజు పెట్రోల్, డీజిల్ ధరల్ని సవరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వేర్వేరు ట్యాక్సుల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ధరల్లో మార్పులు ఉండనున్నాయి.