ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు
2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. అయితే కర్ణాటక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే, కేంద్ర కార్మికశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆ వెంటనే పీఎఫ్ ఖాతాలు కలిగిన 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. కాగా గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం.
2015-16లో 8.88శాతంగా ఉన్నవడ్డీరేటును 2016-17లో 8.65 శాతానికి, 2017-18లో 8.55శాతానికి తగ్గించారు. అయితే ఆ వడ్డీరేటు మరింత తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పట్టుబడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చినా.. చివరకు ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది.