సమస్యను సృష్టించి సొంత రాజకీయాల కోసం టీడీపీ పార్లమెంటును వాడుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం అంటూ భూటకపు దీక్షలు, పోరాటాలు చేస్తున్న టీడీపీ పార్టీ అసలు వైఖరిని మోదీ పార్లమెంటులో బయటపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ .. ఏపీకి ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని టీడీపీ అంగీకరించిన తర్వాతే ప్యాకేజీ ప్రకటించినట్టు ప్రధాని స్పష్టం చేశారు. హోదా కంటే ప్యాకేజీ చాలా బాగుందని టీడీపీ వాళ్ళు అన్నారని, 2016లో అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించారని.. కానీ ఇప్పడు రాజకీయ ప్రయోజనాల కోసమే యు-టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఎన్‌డీయే నుండి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన విషయాలు బయటపెట్టారు మోదీ.


“ప్యాకేజీ ఎందుకు ఇస్తున్నామో స్పష్టంగా చెప్పాను, ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామని చెప్పాను. వైసీపీ ఉచ్చులో మీరు చిక్కుకోవద్దు అని సలహా ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలా చేయొద్దని చెప్పాను” అని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం తన వైఫల్యాను కప్పిపుచ్చుకోవడానికే ప్రత్యేక హోదా విషయంలో యు-టర్న్ తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో వ్యతిరేక పోరాటంతోనే టీడీపీ మొదటి ఏడాదంతా గడిపిందని, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవకాశవాద రాజకీయాలను ఏపీ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.


'ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని ఇప్పుడూ అంటున్నాను' అని తెలిపారు. “14వ ఆర్థిక సంఘం సాధారణ, ప్రత్యేక రాష్ట్రాల విషయాన్ని పక్కన పెట్టాలని సిఫార్సు చేసింది. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాల ప్రాతిపదికన చూడాలని చెప్పింది. 14వ ఆర్థికసంఘం సిఫార్సులు మమ్మల్ని కట్టడిచేశాయి. అందుకే 2016 సెప్టెంబర్‌‌లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. సీఎం చంద్రబాబు కూడా అందుకు స్వాగతించారు” అని తెలిపారు. 'ఏపీ ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నాను, ఏపీ అభివృద్ధికి బిజెపి వెనకడుగు వేయదు, ఏపీ ప్రజల ఆంక్షలు నెరవేర్చడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు' అని స్పష్టం చేశారు.