పదవీకాలం ముగుస్తున్న ఎంపీలను అభినందించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులను అభినందించారు. బుధవారం రాజ్యసభలో ప్రసంగించిన మోదీ, పదవీ విరమణ చేస్తున్న సభ్యులు అందించిన సేవలను కొనియాడారు. ఉత్తమ సేవలు అందించినందుకు అభినందనలు తెలిపారు. పార్లమెంట్ ఎగువసభ సభ్యుల సేవను దేశం మర్చిపోలేదని ఆయన అన్నారు. రాజ్యసభలో 59 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌తో ముగుస్తుంది.
దేశ ప్రజాస్వామ్యంలో ఈ సభ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. కె.పరశరన్, ప్రొఫెసర్ కురియన్‌ల గురించి ప్రసంగంలో మాట్లాడుతూ, వారి సహకారం ఎప్పుడూ మరవలేనిదని చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలకు కూడా మోదీ వీడ్కోలు పలికారు. ట్రిపుల్ తలాక్ లాంటి చారిత్రాత్మక బిల్లులో మీరు భాగస్వాములై ఉంటే మరింత బాగుండేదని అన్నారు. పదవీ విరమణ అయిన సభ్యులు దేశ భవిష్యత్ కోసం శ్రమిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, ఫేర్‌వెల్ పాక్షికమని, రాజకీయ నాయకుడికి పదవీవిరమణ ఎన్నడూ ఉండదని, రిటైర్ అవుతున్న వారికి కృతజ్ఞతలు అని చెప్పారు.
అంతకు ముందు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నామినేటెడ్ పోస్టులతో సహా మొత్తం 59 మంది రిటైర్ అవుతున్నారని చెప్పారు. ప్రతి రెండేళ్ల కొకసారి ఈ ప్రక్రియ సాగుతుందని, కొత్త సభ్యులు కొత్త ఆలోచనలతో, కొత్త దృక్పథంతో సభకు వస్తారని, సభ శాశ్వత సభ కనుక నిరంతరం కొనసాగుతుందని అన్నారు.