నేడు `గ్రామ్ స్వరాజ్ అభియాన్’కు ప్రధాని శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కాండ్లా జిల్లా రామ్‌నగర్‌లో జరిగే గిరిజనుల సంప్రదాయ వేడుక ‘ఆది మహోత్సవ్’లో మోదీ పాల్గొననున్నారు. అలాగే నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ‘రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్’ ను ప్రధాని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ మొదట రామ్‌నగర్‌లో ప్రాచీన గిరిజన సంస్కృతి, వారసత్వ పరిరక్షణపై తలపెట్టిన మూడురోజుల సదస్సు 'ఆది మహోత్సవ్' ను ప్రారంభిస్తారు. ఆ తరువాత, రాబోయే ఐదు సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధికై రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తారు. అలాగే, ప్రధాన మంత్రి స్థానిక ప్రభుత్వ డైరెక్టరీని జాతికి అంకితం చేస్తారు.
పంచాయతీరాజ్ నిపుణులైన దాదాపు 2 వేల మంది హాజరయ్యే సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా పంచాయతీ ప్రతినిధులు హాజరయ్యే బహిరంగసభలో కూడా మాట్లాడుతారని జిల్లా అధికారులు వెల్లడించారు. అలాగే 100 శాతం పొగలేని వంటగదులు నిర్మాణం, ఇంద్రధనుష్ మిషన్ కింద 100 శాతం టీకాల కార్యక్రమం, సౌభాగ్య పథకం కింద 100 శాతం విద్యుదీకరణలను పూర్తిచేసిన గ్రామాల సర్పంచులను కూడా ప్రధాని మోదీ సన్మానిస్తారు. అనంతరం మనేరిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ యొక్క ఎల్.పి.జి బాట్లింగ్ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఆతరువాత వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతారు.