న్యూఢిల్లీ: భారత ఆర్థిక పురోగతిలో వ్యవసాయం అత్యంత ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ద్వారా ఆయన తన భావాలను ప్రజలతో పంచుకున్నారు. రేడియో కార్యాక్రమం 'మన్ కీ బాత్' లో మాట్లాడిన ఆయన ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్నదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడటం ఇది 42వ సారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రామ్ మనోహర్ లోహియా, చౌదరి చరణ్ సింగ్, దేవీలాల్ వంటి వారందరూ చెప్పారన్నారు. దూరదర్శన్‌లో వ్యవసాయం కోసమే ప్రత్యేకంగా ఉన్న కార్యక్రమాలని దేశంలోని ప్రతి రైతూ చూడాలని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణల కోసం కసరత్తు చేస్తున్నామని..  తమ ఉత్పత్తులకు, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ఈ సంస్కరణలు ఉంటాయన్నారు.


గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మోదీ 'మన్ కీ బాత్'లో పేర్కొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని.. దేశ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఎండాకాలంలో పశు, పక్ష్యాదుల దాహ్యార్తిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రజలలో యోగా పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోదీ అన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు (జూన్ 21న) అందరూ తమతో  పాటు  చుట్టుపక్కల వారంతా యోగా చేసేలా ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని.. ప్రపంచం అంతా గుర్తించిందన్నారు.


భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 25న ఆసియన్ దేశాల ప్రతినిధులు భారత్‌కు వచ్చారని, వారితో పాటు ఆయా దేశాల సాంస్కృతిక బృందాలు కూడా వచ్చాయనీ, ఆ బృందాలలో అత్యధిక బృందాలు రామాయణ గాధను ప్రదర్శించాయనీ, ఇది భారత్‌కు గర్వకారణమని మోదీ అన్నారు.