భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్న సుపరిపాలనపై విశ్వాసం కనబర్చి, బీజేపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టినందుకు ఈశాన్య భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈశాన్యంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. " ఈశాన్య భారతీయులు తమ పార్టీపై, ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి భవిష్యత్‌ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తాం " అని మరోసారి హామీ ఇచ్చారు. ఈశాన్యంలో భారతీయ జనతా పార్టీ విజయం అంత ఆషామాషీ కాలేదని, ఎంతోమంది పార్టీ కోసం కృషిచేయగా, ఇంకెంతో మంది పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారని పార్టీ శ్రేణులకు సైతం కృతజ్ఞతలు తెలిపారు మోదీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఈశాన్య భారతం ఇప్పుడు అసలైన అభివృద్ధిపథంలో పయనించేందుకు బాటలు పడ్డాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. " ఇంతకుముందు కేంద్రంలో అధికారంలో వున్న నేతలు ఎన్నిసార్లు ఈశాన్యంలో పర్యటించారో, అంతకన్నా ఎక్కువ ఈ నాలుగేళ్ల కాలంలోనే ఎన్డీయే ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు ప్రతీ 15 రోజులకు ఓసారి ఈశాన్య రాష్ట్రాల్లోని ఏదో ఓ జిల్లాలో పర్యటించి 24 గంటలు అక్కడే గడిపి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. రాత్రి పూట కూడా అక్కడే బస చేసి స్థానికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారాలపై దృష్టిసారించారు. ఈశాన్య భారత ప్రజలు ఇవన్నీ గమనించారు. అందుకే తమ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టేందుకు ముందుకొచ్చారు " అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.