Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు వెళ్లే భక్తులకోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రధానమంత్రి అంగీకరించారు. దీంతో అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ విషయంలో సహకరించినందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏటా కోటిమందికి పైగా అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో స్వాములు డిసెంబర్, జనవరి  నెలల్లో మండల దీక్ష సందర్భంగా శబరిమలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో విమాన సౌకర్యాన్ని కల్పించాలని చాలా కాలంగా భక్తుల నుంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై ప్రధాని సూత్రప్రాయంగా అంగీకరించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సైట్  క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  


నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో మధ్యతరగతి ప్రజలు కూడా విమానాలు ఎక్కేలా.. అందుబాటు ధరల్లోకి విమాన ప్రయాణాన్ని తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో 2014కు ముందున్న విమానాశ్రయాలు ఎనిమిదేళ్లలోనే రెట్టింపయ్యాయని చెప్పరు. ఆధ్యాత్మిక యాత్రాక్షేత్రాల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధానతను మెరుగుపరచడం ద్వారా సౌలభ్యంగా మార్చడం ద్వారా భక్తులు, సామాన్య ప్రజానీకానికి సౌలభ్యాన్ని అందించాలనేది కేంద్ర  ప్రభుత్వం ఆలోచన అని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాల్లో మౌలికవసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.


గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పాలసీ నిబంధనల  ప్రకారం విమానాశ్రయం ఏర్పాటుకు 2 రకాల అనుమతులు అవసరం అవుతాయని.. ఇందులో మొదటిది సైట్ క్లియరెన్స్‌కు అనుమతి వచ్చిందనిన్నారు. రెండోది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అనుమతులు అవసరం ఉందన్నారు. ఈ విమానాశ్రయం అభివృద్ధికి 2263.18 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు వెల్లడైంది. టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ (టీఈఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం.. పీపీపీ మోడల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు రూ.3,973 కోట్లు కావొచ్చని అంచనా వేశారు.