భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మించింది. అత్యంక సంక్లిష్టతల మధ్య 9ఏళ్లు శ్రమించి దీన్ని నిర్మించారు. సుమారు రూ.605 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం.. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్టోబర్‌ 4 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, గౌహతిలకు ఇక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. భారత్‌-చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కొండచరియలు గల ఈశాన్య రాష్ట్రంలో ఇదే తొలి విమానాశ్రయం కావడం విశేషం. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌గా దీన్నిఅభివృద్ధి చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణీకులకు ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


ఈ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ ఉడాన్ పథకానికి ఒక ఉదాహరణ. 2016లో కేంద్రం రీజనల్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. విమాన సర్వీసులను సామాన్యులకు చేరువగా తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.


ఆదివారం సాయంత్రం ఎంఐ-8 విమానంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ గంగా ప్రసాద్‌, సీఎం పవన్‌ చామ్లింగ్‌ తదితరులు లివింగ్‌ ఆర్మీ హెలిపాడ్‌లో స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేశారు.


సిక్కిం అందాలకు ముగ్దుడైన ప్రధాని


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని ప్రకృతి అందాలకు ముగ్ధుడయ్యారు. స్వయంగా అక్కడి అందాలను తన ఫోన్‌తో ఫొటోలు తీసి.. సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.  ఫోటోలను ట్వీట్ చేస్తూ ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. రాష్ట్రం ఎంతో నిర్మలమైనదని, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.