మంగళవారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మలకు సమన్లు జారీచేసింది. పీఎన్‌బీ స్కాం దర్యాప్తులో భాగంగా వీరికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అయితే నీరవ్ మోదీ సంస్థలతో తమకేమీ సంబంధం లేదని, చౌక్సీకి చెందిన గీతాంజలి సంస్థకు మాత్రమే రూ.405 కోట్లు ఋణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు కూడా ఇదే తరహాలోనే ఋణం ఇచ్చినట్లు తెలుస్తోంది.


పీఎన్‌బీలో రూ.12,600 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని అంకుల్ మోహుల్ చౌక్సిలకు సంబంధించే ఈ నోటేసులు వారికి పంపారు. ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు నోటీసులు అందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబై ఎయిర్ పోర్టులో గీతాంజలి గ్రూప్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చిటిలియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పీఎన్‌బీ స్కాంలో సీబీఐ అధికారులు అతడిని విచారిస్తున్నారు.  సీబీఐ ఇప్పటివరకు పీఎన్‌బీ కుంభకోణంతో సంబంధం ఉన్న 16 మందిని అరెస్టు చేసింది. కాగా చందా కొచ్చర్, శిఖా శర్మలకు సమన్లు  అందడంతో ఆ బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయి.