ఎన్నికల చరిత్రలో తొలిసారి ఇలా ముందుగా ముగిసిన ఎన్నికల ప్రచారం
పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం రాత్రి 10 గంటలకు ప్రచారపర్వానికి తెరపడింది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన ప్రచారం కోల్‌కతాలో చెలరేగిన హింస కారణంగా మరో 20 గంటలు ముందుగానే.. అంటే గురువారం రాత్రి 10 గంటలకే ముగించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత దేశ ఎన్నికల చరిత్రలో ఇలా షెడ్యూల్ చేసిన సమయంకన్నా ముందుగా ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడం ఇదే తొలిసారి.
మే 19న జరగనున్న లోక్ సభ చివరి విడత ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 9 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కోల్‌కతా నార్త్, కోల్‌కతా సౌత్, దుమ్ దుమ్, బరసత్, బసిర్‌హట్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, జయనగర్(ఎస్సీ), మధురాపూర్ లోక్ సభ స్థానాలకు చివరిదైన ఏడవ విడత ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది.