ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్ లేదని..నాటక ప్రదర్శనకు అనుమతి నిరాకరణ
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మరో మారు వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల డ్రామా సొసైటీ ఓ నాటక ప్రదర్శనకు సంబంధించి యూనివర్సిటీ నుండి పర్మిషన్ తీసుకుంది.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మరో మారు వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల డ్రామా సొసైటీ ఓ నాటక ప్రదర్శనకు సంబంధించి యూనివర్సిటీ నుండి పర్మిషన్ తీసుకుంది. అయితే నాటకానికి సంబంధించిన బ్యానర్లను యూనివర్సిటీ గేట్లకు కట్టినప్పుడు.. వాటిపై పలువురు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. కారణం ఏమిటంటే.. ఆ బ్యానర్ పై డిజైన్ చేసిన భారతదేశ పటంలో కాశ్మీర్ మిస్ కావడమే. అయితే ఆ మ్యాప్ భారతదేశానికి స్వాతంత్ర్యం రాక మనుపటిదని.. పైగా ఆ మ్యాప్‌కి నాటకంలోని కథాంశానికి సంబంధముందని సొసైటీ వారు తెలపడంతో విశ్వవిద్యాలయ యాజమాన్యం మండిపడింది.
తొలుత బ్యానర్లను తొలిగించమని ఆదేశించిన యాజమాన్యం.. తర్వాత నాటకాన్ని కూడా ప్రదర్శించవద్దని.. తాము పర్మిషన్ విత్ డ్రా చేసుకుంటున్నామని సొసైటీకి తెలిపింది. విశ్వవిద్యాలయంలో వివాదాస్పదమైన నాటకాలు ప్రదర్శించడానికి తాము అనుమతి ఇవ్వలేమని తెలిపింది. అయితే అది వివాదాస్పదమైన నాటిక కాదని సొసైటీ అభిప్రాయపడింది.
ప్రముఖ నాటక రచయిత అస్గర్ వజహత్ రచించిన "జిస్ లాహోర్ ర వెంక్య" అనే నాటకం చాలా సుపరిచితమైన నాటకమని.. గతంలో కూడా చాలాసార్లు ఆ నాటకం ప్రదర్శితమైందని సొసైటీ వివరణ ఇచ్చింది. అయినా.. పలు సెక్యూరిటీ కారణాల వల్ల ఆ నాటక ప్రదర్శనకు తాము అనుమతిని నిరాకరిస్తున్నామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ నేత సురేంద్ర రాజపుత్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ప్రభుత్వం కారకులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాకే.. యూనివర్సిటీ వర్గాలు నాటకాన్ని రద్దు చేశారని తెలుస్తోంది.