పాట్నా: పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. పార్టీ రాసుకున్న రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడంపై తన సొంత పార్టీ జేడీయూపై ప్రశాంత్ కిశోర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మతాన్ని ఆధారంగా చేసుకొని వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే ఈ బిల్లు... పౌరసత్వ హక్కుకు తూట్లు పొడిచేలా ఉందని అన్నారు. ఓవైపు జేడీయూ పార్టీ అధినాయకత్వం గాంధేయవాద ఆదర్శాలతో ముందుకుసాగుతుంది.మరోవైపు పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీ ప్రవేశికలోనే మూడుసార్లు లౌకికవాదం అనే పదం ఉందని.. అటువంటి జేడీయు పార్టీ సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లుకు మద్దతు పలకడం ఆవేదనకు గురిచేసిందన్నారు.


ప్రశాంత్ కిషోర్ గతంలో జాతీయ పౌరపట్టికపై(NRC)పై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభలో 391 మంది సభ్యులు హాజరవగా.. లోకసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా 80 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు.