పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. అంతేకాకుండా చిన్నారులపై వేధింపుల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించే నిర్ణయానికి ఆమోదం లభించింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా పోక్సో చట్ట సవరణలు చేశారు. కథువా అత్యాచార ఘటనతో కేంద్రం ఈ అత్యవసర ఆదేశాన్ని తీసుకొచ్చింది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్‌ అత్యవసర సమావేశంలో చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరి శిక్ష విదించాలనే ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం, 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధిస్తారు. రేప్‌ కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే న్యాయవిచారణను కూడా రెండునెలల్లో ముగించాలి. అప్పీళ్లను సైతం ఆరునెలల్లోనే పరిష్కరించాలి. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి గానీ, గ్యాంగ్‌ రేప్‌ పాల్పడితే ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదు. బెయిల్‌పై నిర్ణయం తీసుకోవడానికి 15 రోజుల ముందు ప్రభుత్వ న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి నోటీసు ఇవ్వాలి.


ఈ ఆర్డినెన్స్ ప్రకారం, బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేస్తారు. అత్యాచార కేసుల పరిశీలన కోసం అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తారు.  అత్యాచారాలకు పాల్పడే నేరస్థుల డాటాబేస్‌ను తయారుచేసి, రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటారు. బాధితులకు సహాయం చేసేందుకు ప్రతి జిల్లాల్లోనూ వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.


కాగా ఈ అర్దినేన్స్ పై నిర్భయ తల్లి స్పందించారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష  విధించేలా ఆర్డినెన్స్ ను తీసుకురావడం చాలా మంచిదే.. అయితే ప్రతి రేపిస్టుకు అదే శిక్ష విధించాలి అని డిమాండ్ చేశారు.